భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నీటి వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ భూగర్భ జలబోర్డు అధికారులు జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున జిల్లాలో సాగు రంగానికి అత్యధికంగా 97 శాతం భూగర్భ జలాలు వినియోగం అవుతుండగా, మిగతా మూడు శాతం పరిశ్రమలు, గృహావసరాలకు వాడుతున్నారని తెలిపారు. గడిచిన సీజన్లో సాధారణం కంటే కొత్త ఎక్కువ స్థాయిలోనే వర్షపాతం నమోదయినప్పటికీ, నీటి వాడకం విపరీతంగా ఉండడం వల్ల అనేక మండలాల్లో భూగర్భ జలాలు లోతుకు పడిపోయాయని కేంద్రీయ భూగర్భ జలబోర్డు అధికారులు ఆందోళన వెలిబుచ్చారు.

ముఖ్యంగా ఆర్మూర్‌, మోర్తాడ్‌, చందూర్‌ మండలాల్లో భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, మరో పది మండలాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని సమస్య తీవ్రతను తెలియజేశారు. ఒక ఎకరం విస్తీర్ణంలో ఐదు, అంతకంటే ఎక్కువ బోరుబావులను వినియోగిస్తుండడం, నీటి వృధా, వర్షపు జలాలను వృధా చేయడం వంటి కారణాలతో భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయని పేర్కొన్నారు.

ఈ విషయమై కలెక్టర్‌ స్పందిస్తూ, భూగర్భ జలాలను వృద్ధి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. చెక్‌ డ్యామ్‌లు, పర్కులేషన్‌ ట్యాంకులను విరివిగా నిర్మిస్తూ, మైక్రో ఇరిగేషన్‌ పద్ధతులు అవలంభించేలా రైతులను ప్రోత్సహిస్తామని అన్నారు. ఎవరికీ వారు సమస్య తీవ్రతను గుర్తిస్తూ నీటి యాజమాన్య పద్దతుల పై అవగాహన పెంపొందించుకుని తప్పనిసరిగా ఆచరించాలని, వర్షపు జలాలను ఒడిసిపడుతూ, వృధాగా పారే ప్రతి చుక్కను భూమిలోకి ఇంకించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కాగా, శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ఏరియాలో గోదావరి నది ఒడ్డున పోచంపాడ్‌ నుండి నవీపేట మండలం బినోల వరకు 33 అడుగుల వెడల్పుతో ఫార్మేషన్‌ రోడ్డు నిర్మాణం పనులను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారం రోజుల్లోపు పనులు ప్రారంభం కావాలని గడువు విధించారు. అలాగే అటవీ శాఖ బీట్‌ ఆఫీసర్‌ లు తమ పరిధిలోని అటవీ ప్రాంతంలో పది హెక్టార్ల విస్తీర్ణంలో హరితహారం కార్యక్రమం చేపట్టేందుకు పక్క ప్రణాళికతో సిద్ధమై ఉండాలని సూచించారు.

వచ్చే సోమవారం నుండి పనులు ప్రారంభం కావాలని, ఉపాధి హామీ కూలీలను పనులకు వినియోగించుకోవాలని అన్నారు. చిన్నాపూర్‌, సారంగాపూర్‌ అర్బన్‌ పార్కులలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ల్యాండ్‌ అండ్‌ సర్వే అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »