నిజామాబాద్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులో గల చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఓపెన్ జిమ్‌లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, సోలార్ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
అన్ని పనులు జూలై 15వ తేదీ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. అర్బన్ పార్క్ ప్రధాన ప్రవేశ ద్వారం నుండి నలువైపులకి వెళ్లే మార్గాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు.
అందమైన పూల మొక్కలతో పాటు అన్ని రకాల మొక్కలను పెంచాలని సూచించారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నందున రోడ్డు గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులను పార్కు అందాలు ఆకర్షించే రీతిలో సుందరంగా ముస్తాబు చేయాలని కలెక్టర్ సూచించారు. అర్బన్ పార్కుకు చుట్టూరా ఉన్న కల్లేడి, మాక్లూర్, అమ్రాబాద్, చిన్నపూర్, మామిడిపల్లి, గుత్ప గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో 30 వేల మొక్కలు అర్బన్ పార్క్ లో నాటేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
అటవీ ప్రాంతాల్లో ఉండే మొక్కలన్నీ అర్బన్ పార్క్ లో ను కనిపించాలన్నారు. అర్బన్ పార్కుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం అవసరమైన సదుపాయాలను నెలకొల్పాలని సూచించారు. చిన్నారుల కోసం సుమారు 1500 చదరపు గజాల స్థలంలో ప్లే జోన్ ఏరియా ఏర్పాటు చేయాలని అన్నారు. మొక్కలు నాటే పనుల కోసం వన సేవకులు, ఉపాధిహామీ కూలీల సహాయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఖాళీ స్థలాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఎంత ఎక్కువ పరిమాణంలో మొక్కలు నాటితే అంత మంచిదని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, ఎఫ్‌డిఓ భవాని శంకర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.