నిజాంసాగర్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా మే నెలలోనే పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకుంటాయి. కానీ ఇంతవరకు పాఠ్యపుస్తకాలు ముద్రణ కాక గోదాంలోకి చేరలేదు. కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు సక్రమంగా నడవని విషయం తెలిసిందే.
ఈ సారి సకాలంలో స్కూళ్లు తెరుస్తున్నపటికి విద్యాబోధనకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇంతవరకు ప్రభుత్వ స్కూళ్లకు పంపిణి చేయకపోవడం ఆందోళన కల్గిస్తోందని మరోవైపు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాద్యమంలో బోధనను ప్రవేశపెట్టింది. ఈ సారి ఒకటోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాద్యమం అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విడతలవారీగా నైపుణ్య శిక్షణ ఇచ్చారు.
ఇప్పటివరకు గోదాములకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు 15 శాతం కూడా లేకపోవడం శోచనీయం. ఏడాది ఆంగ్లమద్యమం ప్రవేశపెడుతుండడంతో పాఠ్యపుస్తకాల ముద్రణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సగం పుస్తకాల ముద్రణ కూడా పూర్తి కాలేదని సమాచారం. దాదాపు సగం పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకుంటేనే వాటిని స్కూళ్లకు తరలించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్రభుత్వ స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు పంపిణి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.