నిజామాబాద్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల, జర్నలిస్టుల, పెన్షనర్ల ఆరోగ్య పథకంలో భాగంగా నిజామాబాదులో ఏర్పాటైన వెల్ నెస్ సెంటర్ నందు మందులతోపాటు గా 57 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీనిని రిటైర్డు ఉద్యోగులందరూ ఉపయోగించుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే. రామ్మోహన్రావు విజ్ఞప్తి చేశారు.
గత సంవత్సరం తమ సంఘము విజ్ఞప్తి మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించేందుకు పి.హెచ్.సి లతో పాటు వెల్నెస్ సెంటర్‌ను కూడా కలెక్షన్ కేంద్రంగా అనుసంధానించారని, ఆ మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. వేలాది రూపాయల విలువైన రక్త పరీక్షలను ఉచితంగా వెల్నెస్ సెంటర్ నందు నిర్వహిస్తున్నందున దీనిని లబ్ధిదారులందరితో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా వినియోగించుకోవాలని వారు తెలిపారు. సమావేశంలో నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, కార్యదర్శి హమీద్ ఉద్దీన్ పాల్గొన్నారు.