నిజామాబాద్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల వ్యవధిలో విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన మీదట ఏ ఒక్క పని కూడా పెండిరగ్ ఉండకూడదని సూచించారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రతి నివాస ప్రాంతంలోనూ వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేస్తూ, శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, ఎక్కడ కూడా వేలాడుతున్న విద్యుత్ తీగలు ఉండకూడదని అన్నారు. విద్యుత్ వసతి లేని జిల్లాలోని 279 వైకుంఠధామాలకు సంబంధించి డీడీలు చెల్లించిన 135 వైకుంఠధామాలకు తక్షణమే విద్యుత్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు.
ప్రతి వైకుంఠధామంలో తప్పనిసరిగా బల్బు వెలిగేలా, బోరు మోటారు పనిచేసే పరిస్థితి ఉండాలన్నారు. విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయించేందుకు మండల పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, ట్రాన్స్ కో ఏ.ఈలు పూర్తి సహకారం అందించాలన్నారు. కాగా, జిల్లాలోని అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ల ఆవరణలోని ఖాళీ ప్రదేశాల్లో ఈసారి హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి చదరపు మీటరుకు ఒక మొక్క చొప్పున నాటాలని తెలిపారు. ఒక్కో సబ్ స్టేషన్ వారీగా పూర్తి వివరాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని, వచ్చే వారం ఈ అంశంపై తాను క్షుణ్ణంగా సమీక్ష జరుపుతానని కలెక్టర్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జయసుధ, ట్రాన్స్ కో డీ.ఈ (టెక్నికల్) డి.వెంకటరమణ, ఏడీఈ లు తోట రాజశేఖర్, రఘు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ట్రాన్స్ కో ఏ.ఈలు పాల్గొన్నారు.