నందిపేట్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని జిజి నడుకుడ గ్రామ గోదావరి తీరాన జింకలు సందడి చేస్తున్నాయి. గతంలో కూడా ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో గోదావరి తీరాన పెద్ద సంఖ్యలో జింకలు వస్తున్నాయి. వీటిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పక్షులు, జింకల రాక తో పర్యాటకుల సందడి పెరిగింది.
గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో జింకలు సందడి చేసాయి. వాటిని చూడడానికి జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి, అప్పటి సిపి కార్తికేయ, తెలంగాణ రాష్ట్ర పర్యటక శాఖ అధికారిని శోభ హైదరాబాద్ నుండి ఏప్రిల్ నెలలో వచ్చి గోదవారి తీరాన్ని పర్యటించి ఇట్టి ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి వెళ్లారు. అయితే కరోన మూలంగా పర్యాటకులు రాలేదు. ఈ సంవత్సరం కరోన కేసులు తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఇది వరకే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత అధికారుల సమావేశంలో నిర్ణయించారు. దీంతో నందిపేట్ మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలకు పర్యాటక శోభ రానుంది.
టూరిజం అభివృద్ధి సంస్థతో పాటు, అటవీ అభివృద్ధి సంస్థ కూడా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో టూరిజం స్పోర్ట్స్ ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నరని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుండి మొదలుకుని బినోల వరకు గల బ్యాక్ వాటర్ ఏరియా పరీవాహక ప్రాంతం గుండా అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఇది వరకే కలేకర్ట్ ఆదేశించారు.
గోదావరి ఒడ్డు వెంబడి కనీసం 33 అడుగుల మేర రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇదివరకే నందిపేట్ మండలం లోని గోదావరి పరీవాహక ప్రాంతం అంతటా భూ సేకరణ చేసి ఉన్నందున రోడ్డు నిర్మాణానికి స్థల సమస్య వుండదని కలెక్టర్ ధీమాతో వున్నారు.
గోదావరి గోదావరి తీరాన సందడి చేస్తున్న జింకలను చూడడానికి వచ్చే పర్యాటకులు పర్యావరణాన్ని కాపాడాలి. ఇచ్చట వచ్చే పర్యటకులు తినుబండారాలు తెచ్చి ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు వదలకూడదు, ప్లాస్టిక్ వ్యర్థలు ఇక్కడ ఉండడం వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది, ఆ కలుషితం కారణంగా వన్య ప్రాణులకు హాని కలిగే అవకాశం ఉంటుంది కావున దయచేసి పర్యావరణ పరి రక్షణ కొరకు అందరు సహకరించగలరు.