కామారెడ్డి, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
గ్రామస్థాయిలో చట్టాలపై పోలీస్, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాతల ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేయిస్తామని చెప్పారు. రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే తమకు సమాచారం అందిస్తే ఆర్ఫాన్ సర్టిఫికెట్ వారి ఇంటికి పంపే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు లేని పిల్లలకు గురుకుల పాఠశాలలో రిజర్వేషన్ సౌకర్యంలో సీటు లభిస్తోందని పేర్కొన్నారు. షెడ్యూల్డు కులముల, తెగల ప్రజలపై జరిగిన అకృత్యాలకు సంబంధించిన కేసుల గురించి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ స్పెషల్ కోర్టు అడిషనల్ పిపి కవిత, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డిటిఓ సాయి బాబా, జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఆర్డివోలు రాజా గౌడ్, శీను, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఏం. రాజన్న, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మల్లికార్జున్, మల్లయ్య, రాజు, గణేష్ నాయక్, బంటు రాజు, కైలాస్ పాల్గొన్నారు.