నిజామాబాద్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ మరణం ప్రజా ఉద్యమ నిర్మాణానికి తీరని లోటని వివిధ వామపక్ష పార్టీల నాయకులు నివాళ్లర్పించారు. డివికె ఆదివారం ఉదయం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందినట్లు పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. సిపిఐ, సిపిఎం, ప్రజాపంథా జిల్లా నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరుడు డివికె ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి నిజామాబాద్ జిల్లా విప్లవోద్యమానికి పునాది వేసిన వారిలో ఒకరిని, అదే విధంగా ఉత్తర తెలంగాణ ప్రజా ఉద్యమానికి పునాది వేశారని పేర్కొన్నారు. మార్క్సిస్ట్, లెనినిస్టు పార్టీ చండ్ర పుల్లారెడ్డి తో కలిసి సిద్ధాంత పోరాటం చేశారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజా ఉద్యమానికి 1969 నుండి ఇప్పటివరకు విడదీయరాని సంబంధం ఉందని వామపక్ష నేతలు అన్నారు.
ప్రధానంగా రైతన్న ఉద్యమంతో పాటు అసంఘటిత రంగ బీడీ కార్మికులతో 1972లో బీడీ కార్మిక సంఘం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రజాపంథా జిల్లా నాయకులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని మార్క్స్ భవన్‌లో డీవీకే భౌతికకాయానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. కామ్రేడ్ డివికే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే ఆయనకు నిజమైన నివాళిగా పేర్కొన్నారు.