కామారెడ్డి, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 నుంచి జూలై 15 వరకు పశువుల అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో పశువుల అక్రమ రవాణా, జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టం అమలు అంశాలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
అనుమతి లేకుండా పశువులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశు రవాణా చట్టం అతిక్రమిస్తే చర్యలు తప్పవని చెప్పారు. రెవెన్యూ, పోలీస్, రవాణా, పశుసంవర్థక, పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. పోలీస్ కళాజాత, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో పశువుల అక్రమ రవాణా, జంతు సంరక్షణ, గోనిషేధ చట్టం అమలు అనే అంశాలపై కళాజాత ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.
సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్పీ అన్యోన్య, ఆర్టిఓ వాణి, ఆర్‌డిఓ శీను, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగన్నాథ చారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డిపిఓ శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.