నిజామాబాద్, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే శుక్రవారం నాటికి ఏ ఒక్క పని కూడా పెండిరగులో ఉండకూడదని గడువు విధించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ ఏరియాలలో ఇంకనూ ఎక్కడైనా ఖాళీ స్థలాలు మిగిలి ఉంటే పూర్తిస్థాయిలో మొక్కలు నాటాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్ల వద్ద ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లా మీదుగా వెళ్తున్న 44, 63 జాతీయ రహదారులకు ఇరువైపుల ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే పనులను జాతీయ రహదారి పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు తమవంతు బాధ్యతగా పర్యవేక్షించాలని అన్నారు.
జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటించాలన్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, రైతు వేదికలు, విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఖాళీ స్థలాలన్నీ మొక్కలతో పచ్చదనాన్ని సంతరించుకుని ఆహ్లాదకరంగా కనిపించాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయించాలని హితవు పలికారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని, సంబంధిత శాఖల జిల్లా అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
అన్ని వైకుంఠధామాల్లో నీటి వసతి అందుబాటులోకి తేవాలని, పది శాతం డీ.డీలు చెల్లించిన జీపీల పరిధిలోని వైకుంఠధామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ దఫా హరితహారం కార్యక్రమాన్ని ఇరిగేషన్ స్థలాల్లో చేపట్టాల్సి ఉన్నందున కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని భూములను గుర్తిస్తూ హద్దులు నిర్ణయించాలని సూచించారు.
హద్దులు నిర్ణయించిన చోట గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీల తోడ్పాటుతో బండ్ (ఒడ్డు) ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, అలీసాగర్, రామడుగు ప్రాజెక్టులకు చెందిన మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో గ్రామ పంచాయతీల వారీగా ఈ పనులు చేపడుతూ, వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.
కాలువల స్థలాలు హద్దులతో సహా ఖరారైతే విరివిగా మొక్కలు నాటడంతో పాటు మిగులు స్థలాలను ధాన్యం సేకరణ కేంద్రాలుగా, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం, మినీ బృహత్ పల్లె ప్రకృతి వనం వంటి వాటికి వినియోగించుకునేందుకు వీలుంటుందని విషయాన్ని జీపీల పాలక వర్గాలకు, వీడీసీ ప్రతినిధులకు వివరిస్తూ వారిని హద్దుల గుర్తింపు ప్రక్రియలో భాగస్వాములు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.