నిజామాబాద్, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికులకు 12 గంటల పని విధానం రద్దు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడారు.
మోడీ ప్రభుత్వం జులై ఒకటో తేదీ నుండి అమల్లోకి తీసుకొస్తున్న 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనాల చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, అగ్నిపథ్ స్కీంను రద్దుచేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏడుగురు సభ్యులు ఉంటే యూనియన్ రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని ఆయన కోరారు.
వంద సంవత్సరాలుగా భారతదేశ కార్మికవర్గం పోరాడి సాధించిన చట్టాలను రద్దు చేసిన మోడీ ఏముఖంతో ప్రజల ముందుకు వస్తారని ఆక్షేపించారు. ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు రేపుతూ ప్రజల ఆలోచనలు పక్కకు మరల్చి ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మడం మానుకోకపోతే మోడీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఓమయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి. నర్సింగరావు, జిల్లా కార్యదర్శులు సుధాకర్, అనిల్ నాయకులు అలీ, ప్రసాద్, భాగ్యలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.