నిజామాబాద్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో బుధవారం గణాంక దినోత్సవ (స్టాటిస్టిక్స్ డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రణాళిక కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.
గణాంక పితామహుడు పీసీ.మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎలాంటి ప్రణాళిక రూపకల్పన చేయాలన్నా, ముందుగా సంబంధిత అంశాల గురించి అవగాహనకు వచ్చేందుకు గణాంకాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయని అన్నారు. మనం ఎక్కడ ఉన్నామన్నది తెలిస్తేనే, ఎక్కడికి వెళ్లాల్సి ఉందనేది నిర్దేశించుకోగల్గుతామని, దీనికి గణాంకాలు మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు.
స్టాటిస్టిక్స్ ఆధారంగానే ఆయా రాష్ట్రాలు, దేశాలు అక్షరాస్యత, పంట దిగుబడుల ఉత్పత్తి, జనాభా వంటి విషయాలను మదింపు చేస్తాయని, తదనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. దీని ప్రాధాన్యత, ఔన్నత్యాన్ని గుర్తెరిగి సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదటే వాస్తవాలతో కూడిన గణాంక వివరాలను సమర్పించాలని హితవు పలికారు. లేని పక్షంలో తప్పుడు గణాంకాల ఆధారంగా లోపభూయిష్ట ప్రణాళికల రూపకల్పన జరిగే ప్రమాదం ఉంటుందన్నారు.
గణాంక పితామహుడు పీసీ.మహలనోబిస్ తన స్టాటిస్టిక్స్ వివరాల ద్వారా దేశ ప్రగతికి దోహదపడ్డారని, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ను కూడా నెలకొల్పారని కొనియాడారు. భారత ప్రభుత్వ సలహాదారుడిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా మహలనోబిస్ అందించిన సేవలకు గాను 1968 లోనే ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది గుర్తు చేశారు.
మహలనోబిస్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకెళ్తూ, దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో ముఖ్య ప్రణాళిక అధికారి జే.శ్రీనివాసులు, గణాంక అధికారి రతన్, మెప్మా పీ.డీ రాములు తదితరులు పాల్గొన్నారు.