కామారెడ్డి, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణాంక సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో బుధవారం 16వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి. సి. మహా లానోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులతో చర్చించి పంటల సాగు వివరాలు అధికారులు గణాంకాలను తయారు చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ , గణాంక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. జనాభా, అక్షరాస్యత, పంటల సాగు వివరాలు గణాంకాలు తయారు చేయాలని సూచించారు. మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయని తెలిపారు.
సీపిఓ రాజారాం మాట్లాడారు. తప్పులు లేకుండా వివరాలు సేకరించాలని కోరారు. నివేదికలు సజావుగా ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ కే. శివ పార్వతి రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ కే. సంపత్ కుమార్, విశ్రాంత స్టటికల్ ఆఫీసర్ మహిజా దేవి,డివిజనల్ డివైస్‌ఓ బి. లక్ష్మణ్, అధికారులు శివ కుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.