కామారెడ్డి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ కవర్లు, వస్తువులకు స్వస్తి పలకాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ప్లాస్టిక్ నిషేధంపై టాస్కుఫోర్సు అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడితే దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పేపర్, వస్త్రం, జనపనారతో తయారుచేసిన సంచులు వాడాలని కోరారు. మునిసిపల్, గ్రామస్థాయిలో జులై 1 నుంచి ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల నిషేధంపై ర్యాలీలు తీయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కూరగాయలు కొనుగోలు చేయడానికి సంచులతో రావడానికి వినియోగదారులకు మునిసిపల్, గ్రామపంచాయతీల అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. ఐకెపి, మెప్మా, మహిళా స్వయం సహాయక సంఘాలతో జనపనార సంచులు తయారు చేయించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిపిఓ శ్రీనివాసరావు, డిఆర్డిఓ సాయన్న, జెడ్పి సీఈవో సాయగౌడ్, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, రమేష్ కుమార్, జగ్జీవన్, అధికారులు పాల్గొన్నారు.