డిచ్పల్లి, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి శ్రీపాద సాయిరాంకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) శనివారం ఉదయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించారు.
బిజినేస్ మేనేజ్ మెంట్ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పాఠ్యప్రణాళిక సంఘం చైర్ పర్సన్ డా. జి. వాణి పర్యవేక్షణలో ‘‘ఎ స్టడీ ఆన్ వెల్ఫేర్ మెజర్స్ ఇన్ సింగరేణి కాలెరీస్ కంపెనీ లిమిటెడ్’’ అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించి టీయూకు సమర్పించారు.
వైవా – వోస్‌కు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలోని మెనేజ్ మెంట్ అండ్ కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బదియుద్ధీన్ విచ్చేసి సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సింగరేణి కంపెనీ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టవలసిన పథకాలను గూర్చి అధ్యయనం చేశారని ప్రశంసించారు.
వైవా – వోస్‌కు చైర్మన్ గా బిజినెస్ మేనేజ్ మెంట్ ఫ్యాకల్టీ ఇంచార్జి పీఠాధిపతి డా. రాజేశ్వరి, కన్వీనర్ గా బి ఒ ఎస్ డా. జి. వాణి వ్యవహరించారు. విభాగాధిపతి డా. కె. అపర్ణ, డా. ఆంజనేయులు తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీపాద సాయిరాం డాక్టరేట్ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి, కంట్రోలర్ ఆచార్య ఎం. అరుణ, పీఆర్ఓ డైరెక్టర్ డా. వి. త్రివేణి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు.