డిచ్‌పల్లి, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో పీజీ చేసిన విద్యార్థి కొప్పుల అనురాగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గల మిచిగన్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ ఫర్మేటిక్స్ కోర్సు చేయడానికి ఎం. ఎస్. అడ్మిషన్స్ పొందారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ కొప్పుల అనురాగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ చేసిన విద్యార్థులలో అమెరికాలో ఎం.ఎస్. చేయడానికి వెళ్తున్న మొట్టమొదటి విద్యార్థి అని అనురాగ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి, ఫార్మాస్యూటికల్ కెమిస్త్రీ అధ్యాపకులు అభినందనలు తెలిపారు. వరంగల్‌లో పుట్టి పెరిగిన అనురాగ్ కుటుంబ తల్లిదండ్రులు జీవనోపాధి కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు సునీత, రాజేశ్వర రావులు. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సులో ప్రవేశం పొందిన అనురాగ్ 2018- 21 వరకు డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికేట్ సాధించారు. అప్పటి నుంచి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా అనురాగ్ మాట్లాడుతూ… ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్ డా. వాసం చంద్రశేఖర్ సహాయ సహకారాలతో అమెరికలోని వివిధ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. మిచిగన్ టెక్నలాజికల్ యూనివర్సిటిలో మాస్టర్ ఆఫ్ సైన్స్ సీటు సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.
ఆగస్ట్ 22 తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతున్న సందర్భంలో ఆగస్ట్‌లో అమెరికాకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తనకు సహకరించిన ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అధ్యాపకులు ఆచార్య నసీం, డా. చంద్రశేఖర్, డా. శిరీష బోయపాటి, డా. సత్యనారాయణలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా విదేశాలలో ఉన్నత చదువుల కోసం లక్ష్యాన్ని ఏర్పరిచిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఎళ్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు.