డిచ్‌పల్లి, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలో కామర్స్ విభాగాధిపతి, పాఠ్యప్రణాళికా సంఘ చైర్ పర్సన్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. రాంబాబు గోపిసెట్టి కేరళ రాష్ట్రంలో గల సెంట్రల్ యూనివర్సిటి ఆఫ్ కేరళలో కామర్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ సోమవారం తన చాంబర్‌లో డా. రాంబాబుకు శాలువా, పుష్పగుచ్చం అందించి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ… సౌమ్యులు, నిబద్ధత, క్రమశిక్షణ కలవారు డా.రాంబాబు సెంట్రల్ యూనివర్సిటిలో నియామకం పొందడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా గత 15 సంవత్సరాల 6 నెలల నుంచి తన సేవలను అందించడమే గాక, వివిధ పాలనాపరమైన పదవులను అలంకరించారన్నారు. ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్‌గా, స్పోర్ట్స్ డైరెక్టర్‌గా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా, అడిషనల్ కంట్రోలర్‌గా, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా, హాస్టల్ వార్డెన్ – వైస్ ప్రిన్సిపాల్‌గా, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తించారన్నారు.
విద్యా బోధన, పరిశోధనలో ప్రత్యేకమైన స్థానాన్ని వహించారన్నారు. విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాల్లో కంటే అధికంగా ఇ – కామర్స్ ద్వారా అనేక ప్రాజెక్ట్ లు, సింపోజియం లు, వర్క్ షాప్ లు, సెమినార్లు నిర్వహించిన ఘనత వీరికే దక్కుతుందన్నారు. దాదాపు వాణిజ్యశాస్త్రంపై 15 పుస్తకాలు రచించారన్నారు. విశ్వవిద్యాలయ అకడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధిలో మంచి భాగస్వామ్యం వహించారన్నారు. మంచి అధ్యాపకుడిగా పేరు గడిరచి విద్యార్థులతో, తోటి అధ్యాపకులతో అత్యంత కలుపుగోలుగా ఉండేవారన్నారు.
మంచి కళాభిరుచి గలవారనిబీ పాటలు పాడడంలో, కవితలు అల్లడంలో, అభినయంలో, నాటకాలు వేయడంలో మంచి ప్రవేశం ఉందన్నారు. ఎల్లవేళలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి జీవన గమ్యాలకు, లక్ష్యాలకు మంచి మార్గాన్ని సూచించేవారని పేర్కొన్నారు. ఆయన సేవలను యూనివర్సిటి ఎప్పటికీ మరిచిపోలేదని అన్నారు.
డా. రాంబాబు మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని తన కన్న తల్లిలాగా భావిస్తున్నానని అన్నారు. తనకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం అందించి ఒక అకడమిషన్‌గా సేవ చేసే భాగ్యం కలిగించిందన్నారు. తనపై ఎంతో మక్కువను చూపిన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, అధ్యాపకులకు, అధ్యాపకేతరులకు, పరిశోధకులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిహెచ్. ఆరతి తదితర అధ్యాపకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.