కామారెడ్డి, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జంతువుల ఆరోగ్యం, పోషణ పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల, మూగజీవాల సంరక్షణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
మూగజీవాలు, పెంపుడు జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని సూచించారు. జంతువులకు హనీ చేయవద్దని కోరారు. మూఢనమ్మకాలతో బహిరంగ ప్రదేశాలలో జంతుబలి చేయరాదని పేర్కొన్నారు. ఎవరైనా జంతుబలి చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. జంతువులపై అధిక బరువు మోపడం, పరిమితికి మించి రవాణా చేయవద్దని సూచించారు.
జంతు సంరక్షణ పై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగన్నాథ చారి, వివిధ శాఖల అధికారులు, జంతు సంరక్షణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.