నిజామాబాద్, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకుంటూ అభినందించారు.
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏమాత్రం తీసిపోవని నిరూపితమైందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు అద్వితీయ ఫలితాలు సాధించేలా కృషి చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్‌ను కలెక్టర్ శాలువాతో సత్కరించారు. అలాగే, ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన పీ.వైష్ణవి 978, అర్బియా మీర్జా 966, బీ.భాగ్యశ్రీ 959, కె.సవిత 962, ఎల్.వసంత 959, ఏ.శ్రీనిత్య 479, జీ.లక్ష్మినర్సింహగౌడ్ 479, ఎండీ.జునైద్ అహ్మద్ 466, ఎం.మేఘా 483 లను కలెక్టర్ సన్మానించారు.
ఎడపల్లిలో గల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలకు చెందిన ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులను కూడా కలెక్టర్ అత్యధిక మార్కులు సాధించిన సందర్భంగా అభినందిస్తూ సన్మానించారు. ఇదే తరహాలో కష్టపడుతూ, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మీరంతా ఎంతో ప్రతిభ కలిగి ఉన్నారనడానికి ఎస్సెస్సీ, ఇంటర్ లో సాధించిన అత్యుత్తమ మార్కులే నిదర్శనమని పేర్కొన్నారు.
ఇకముందు కూడా ఇదే స్పూర్తితో ఉన్నత విద్యను అభ్యసిస్తూ మంచి కెరీర్ ను సొంతం చేసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మొబైల్ ఫోన్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. ఎంత కష్టం వచ్చినా విద్యార్థులను చదువుకు దూరం చేయకుండా మరింతగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎడపల్లి రెసిడెన్షియల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపాల్ సుహాసిని, యఖీన్ అలీ తదితరులు పాల్గొన్నారు.