నిజామాబాద్, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్ ను ఆదేశించారు. ఈవీఎం లు, బ్యాలెట్ యంత్రాలలో చిన్నపాటి తేడా సైతం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏదైనా పొరపాటుకు ఆస్కారం కల్పిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.
సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్ లోనే పూర్తి స్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపర్చాలని, చెదలు నివారణ కోసం అవసరమైన చోట పెస్ట్ కంట్రోల్ చేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంబంధిత పనులను పక్కాగా జరిపించాలన్నారు.
కాగా, పూర్తిస్థాయి మరమ్మతుల కోసం అవసరమైన వెసులుబాటు కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ పంపామని, అనుమతి వచ్చిన వెంటనే పూర్తిస్థాయి మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఈవీఎం గోడౌన్‌లోని విశాలమైన ఆవరణలో విరివిగా మొక్కలు నాటాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.
ప్రహరీకి ఆనుకుని ఏపుగా పెరిగే మొక్కలను నాటాలని, మిగతా ప్రదేశాల్లో పండ్ల మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పక్షం రోజుల్లో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి కావాలని గడువు విధించారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.