కామారెడ్డి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మొదటి స్థానంలో నిలువాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎంపికైన పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాలను, బహుమతులను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసి ప్రతినిధులు తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి పాఠశాలలో స్వచ్ఛత నియమాలు పాటించాలని కోరారు. స్వచ్ఛ పురస్కారాలకు ఎంపికైన 33 పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఎస్‌ఎంసి చైర్మన్లను జిల్లా కలెక్టర్ అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సమన్వయకర్తలు నీలి లింగం, శ్రీపతి, ఉమారాణి వేణుగోపాల్, గంగా కిషన్, మనోహర్, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.