డిచ్‌పల్లి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఉత్తర ప్రదేశ్ వారణాసిలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహింపబడనున్న జాతీయ స్థాయి ‘‘వారణాసి శిక్షా సమ్మేళన్ – మూడు రోజుల ఎడ్యూకేషన్ సమ్మిట్’’లో పాల్గొననున్నారు. 3వ తేదీన సెక్రటరీ యూజీసీ నుండి 27 జూన్, 2022 నాటి ఉత్తరం నం. ఎఫ్. 1-1/2022 (ఎన్‌ఇపి ` విఎస్‌ఎస్) మరియు యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సునీతాశివాచ్ నుండి ఇ – మెయిల్ ఆహ్వానం అందిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి ఆయన బుధవారం బయలుదేరి వెళ్లారు.
వీసీ పర్యటనకు సంబంధించి వసతి, స్థానిక రవాణా మొత్తం యూజీసీ ద్వారా అందించబడుతుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొనే ఒక మంచి అరుదైన అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. దాదాపుగా దక్షిణ భారతదేశంలోని అతి కొద్ది విద్యావేత్తలకు మాత్రమే అందిన ఆహ్వానంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా తాను ఆహ్వానింపబడినందుకు గర్వంగా ఉందన్నారు.
నూతన విద్యా విధానం మీద నిర్వహింపబడే జాతీయ స్థాయి వారణాసి శిక్షా సమ్మేళన్ లో 7 వ తేదీ ప్రారంభ సమావేశంలో గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభోపన్యాసం చేయనున్న సందర్భంలో ఈ సమ్మిట్ గొప్ప విశేషాన్ని సంతరించుకున్నదన్నారు. తదనంతర సాంకేతిక సదస్సులలో ప్రత్యేక అతిథిగా, వక్తగా తన ప్రసంగం ఉంటుందన్నారు.
భారతీయ విద్యా వ్యవస్థలో నూతనంగా పాఠ్యప్రణాళికల్లో చేర్చవలసిన అంశాలపై ఈ సమ్మిట్ లో నిర్ణయం తీసుకోనున్నారన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో సంప్రదాయ దేశీయ కళా రంగ నైపుణ్యాలతో పాటుగా శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక పురోభివృద్ధి కోసం చేపట్టవలసిన అంశాలను తాను ప్రస్తావించదలుచున్నానని చెప్పారు. భారతీయ సాంస్కృతిక పునర్వైభవానికి ఈ సమ్మేళనం ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
దేశ, విదేశాల నుంచి విచ్చేసి పాల్గొనే అధ్యాపకులు, విద్యావేత్తలు, సామాజిక విశ్లేషకులు, రాజ నీతిజ్ఞులు, శాస్త్రవేత్తలతో ఒక మంచి సమైక్యతా అనుబంధం పెరిగే అవకాశం ఉందన్నారు. తన ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ పర్యటన వల్ల తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అకడమిక్ వాతావరణం వృద్ధి పొందనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి పాల్గొనే ఒక గొప్ప విద్యా విశేషమైన జాతీయ సమ్మేళనానికి అరుదైన ఆహ్వానం మీద వారణాసికి బయలుదేరి వెళ్లిన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.