నిజామాబాద్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఆటా మహాసభల నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌తో ఫోన్లో మాట్లాడారు.
ఉభయ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఉభయ జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని 24 గంటలు అలెర్ట్‌గా ఉంచడంతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు ఆయా జిల్లాల కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు కావడం పట్ల జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆరోగ్య శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పూర్తి అప్రమత్తతో ఉండాలన్నారు.
తెగిపోయిన విద్యుత్ వైర్లు,నేలకొరిగిన విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్ ఫార్మర్‌ల వద్ద జాగ్రత్తగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా గ్రామ లైన్ మెన్లు, ఎ.ఈలు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి రెండు గంటలకు ఓసారి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌లకు సూచించారు. దీంతో విద్యుత్ ఘాత ప్రమాదాలు నివారించవచ్చు అన్నారు.
అట్లాగే ఎగువన మహారాష్ట్ర లో కూడా భారీ వర్షాల కురుస్తున్న కారణంగా గోదావరికి కూడా ఉదృతంగా నీరు చేరుతున్న నేపథ్యంలో పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఎస్సారెస్పీ ఇరిగేషన్ అధికారులు కూడా నీటి ప్రవాహ లెక్కలు గంటకోసారి వెల్లడిరచాలని, గేట్లను ఎత్తి నీటిని వదిలే సందర్భంలో కింద ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల అత్యవసర సేవల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు.
అందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి కంట్రోల్ రూం లో ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి, దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. చెరువులు,కుంటలు,చెక్ డ్యాంలు నిరంతరం ఇరిగేషన్ అధికారులు పరిశీలించాలని, స్థానిక ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావొద్దని మంత్రి వేముల విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనలు పాటించి ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలకు సహకరించాలని కోరారు.