నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూచించారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, పోలీస్ కమిషనర్‌లు, ఎస్పీలతో వరద పరిస్థితుల గురించి సమీక్షించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఏకధాటి వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అభివృద్ధి పనుల కోసం గుంతలు తవ్విన ప్రదేశాల్లో ప్రజలు రాకపోకలు సాగించకుండా చూడాలని, అలాంటి చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు.
జలదిగ్బంధం లో చిక్కుకున్న ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపిస్తామని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ వరద పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక సురక్షిత చర్యలు చేపట్టాలని అన్నారు.
జిల్లా కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాల్ పల్లి, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయిందని, ఈ జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నద్ధమై ఉండాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని, సగటున 128 మి. మీ వర్షపాతం నమోదైందని, కొన్ని మండలాల్లో 20 సెంటిమీటర్ల వర్షం సైతం కురిసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అన్నారు. భారీ వర్షాల తాకిడికి పలుచోట్ల పంచాయతీరాజ్ రోడ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని, 15 నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
చెరువులు, వాగుల్లోకి వేగంగా వర్షపు జలాలు వచ్చి చేరుతున్నాయని, అయితే ఎక్కడ కూడా చెరువులకు గండ్లు పడలేదని అన్నారు. నిజాంసాగర్ కాలువలో ప్రమాదవశాత్తు ఇద్దరు పశువుల కాపరులు జారిపడి గల్లంతయ్యారని, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. శ్రీరాంసాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ లో నీటిమట్టం వేగంగా పెరుగుతోందన్నారు.
ఇప్పటికే 60 టీ ఎం సీలు దాటిందని, దీంతో వరద కాలువ ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తెచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ మురళీధర్, ఇంధన శాఖ, మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్ లతో పాటు అడిషనల్ డీజీ జితేందర్,పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, నిజామాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రాన్స్ కో ఎస్.ఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాల మీదుగా రాకపోకలు నిలిపివేయించాలి
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రహదారుల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాలు, వంతెనలు బలహీనంగా ఉన్న ప్రాంతాల మీదుగా రాకపోకలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిషేధించాలని, సురక్షితమైన, ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా వెళ్లేలా చూడాలని పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎక్కడ కూడా చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు. విద్యుత్ సరఫరా కు ఆటంకం తలెత్తకుండా చూడాలని, ఎక్కడైనా అంతరాయం ఏర్పడిన వెంటనే తక్షణ మరమ్మతులు చేపట్టి కరెంటు సరఫరాను పునరుద్ధరించాలని ట్రాన్స్ కో ఎస్.ఈ రవీందర్‌ను ఆదేశించారు.