నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అతి భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్న కారణంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. సోమవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ఈ నెల 11వ తేదీన (సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. తిరిగి వచ్చే సోమవారం నుండి ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక అయిన ప్రజావాణి కార్యక్రమం యధాతథంగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వరద పరిస్థితి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.