కామారెడ్డి, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంటలు, గృహాల వివరాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగూత్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఇప్పటివరకు 469.5 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు. సాధారణ వర్షపాతం 227.9 ఉండగా అదనంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 22 మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయిందని చెప్పారు. వరదలతో దెబ్బతిన్న రోడ్లు, పంటలు, గృహాల వివరాలు సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కామారెడ్డి పట్టణం లోని బతుకమ్మ కుంట లోతట్టు ప్రాంతంగా గుర్తించి వారికి పునరావాస చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. జిల్లాలో 38 కిలోమీటర్లు పంచాయతీరాజ్ రోడ్లు, 40 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బి రోడ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూము పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువును ఆమె పరిశీలించారు.
జుక్కల్, మద్నూర్, బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో సోయాబీన్, వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, పంచాయతీరాజ్, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.