క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలి

నిజామాబాద్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయా శాఖల అధికారులు అండగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ హితవు పలికారు. మరో మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులెవరూ కూడా సెలవులు పెట్టకుండా తమతమ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల పరిశీలన కోసం సీనియర్‌ ఐ ఏ ఎస్‌ అధికారి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూను ప్రభుత్వం నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం నిజామాబాద్‌ జిల్లాలో వర్ష తాకిడికి గురైన పలు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితిని పరిశీలించారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, రేంజ్‌ ఐ.జీ కమలాసన్‌ రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజులతో కలిసి భారీ వర్షానికి తెగిపోయిన జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డును పరిశీలించారు.

ప్రతిసారి వర్షాకాలంలో ఈ సమస్య తలెత్తుతున్నందున శాశ్వత పరిష్కార మార్గాలు చేపట్టాలని సంబంధిత పంచాయతీరాజ్‌ అధికారులకు సూచించారు. అనంతరం గూపన్‌ పల్లిలోని ఇంపీరియల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ముంపు బాధితులను పరామర్శించి, వారికి అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో కలిసి ముంపు బాధితులకు మధ్యాహ్నం భోజనం వడ్డించారు. అలాగే, కలెక్టరేట్‌లో నెలకొల్పిన కంట్రోల్‌ రూంను పరిశీలించి పలు సూచనలు చేశారు.

అనంతరం ప్రగతి భవన్లో అధికారులతో సమావేశమై భారీ వర్షాల వల్ల వాటిల్లిన నష్టం గురించి, చేపడుతున్న సహాయక చర్యలు, తీసుకుంటున్న ముందు జాగ్రత్తల గురించి ప్రత్యేక అధికారి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో అధికారులు సమన్వయంతో పని చేస్తుండడం సంతృప్తి కలిగించిందని, వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాయని అన్నారు. అయితే, రానున్న మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇప్పటికే 66 శాతానికి పైగా చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నందున, ఎక్కడ కూడా చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు వరద స్థితిని నిశితంగా పరిశీలించాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులచే చెరువుల స్థితిగతులను పరిశీలింపజేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటల్లోకి వర్షపు జలాలు పెద్ద ఎత్తున వచ్చి చేరినందున వసతి గృహాలకు చెందిన విద్యార్థులు, ఇతర పిల్లలు ఎవరూ ఈతకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, బాలలను హాస్టళ్ల బయటకు వెళ్లేందుకు అనుమతించకూడదని సూచించారు.

వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా హాస్టళ్లు, స్కూళ్లలో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యమైనదిగా ఉండాలని క్రిస్టినా ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి అందిస్తున్న భోజనం నాణ్యతను కూడా పరిశీలన జరిపించాలని కలెక్టర్‌ కు సూచించారు. జలమయంగా మారిన లోతట్టు నివాస ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ముప్పిరిగొనే ప్రమాదం ఉన్నందున వైద్య బృందాలను ఏర్పాటు చేస్తూ, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నందున నీటి మట్టాన్ని పరిశీలిస్తూ, తగిన పరిమాణంలో దిగువకు నీటిని విడుదల చేయాలని అన్నారు. విద్యుత్‌ ప్రమాదాలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కార్‌ లేకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, ట్రాన్స్‌ కో తదితర శాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మాలపల్లి పరిసరాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు నివాస గృహాల చుట్టూ వర్షపు జలాలు చేరాయని ప్రత్యేక అధికారి క్రిస్టినా దృష్టికి తెచ్చారు. లింగితండా వద్ద నిజాంసాగర్‌ కెనాల్‌లో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని, సోమవారం భీంగల్‌ మండలం బడాభీంగల్‌ గ్రామంలో చెరువులో విద్యుత్‌ వైరు తెగిపడి కరెంటు షాక్‌తో మరొకరు మృతి చెందారని అన్నారు.

ఈ తరహా అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రహదారులు, బలహీనంగా కాల్వర్థులు ఉన్న రోడ్ల మీదుగా రాకపోకలు నిషేధిస్తూ, పోలీస్‌ శాఖ సహకారంతో ట్రాఫిక్‌ డైవర్షన్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. కలెక్టరేట్‌ తో పాటు మున్సిపాలిటీలలో, ట్రాన్స్‌ కో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన ప్రాంతాల్లో సత్వరమే సహాయక చర్యలు చేపట్టేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు.

జిల్లాలో మొత్తం 1067 చెరువులలో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోందని, ఇప్పటివరకు ఎక్కడ కూడా చెరువులకు గండ్లు పడలేదన్నారు. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన దరిమిలా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. కాగా, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి ఐ.జీ కమలాసన్‌ రెడ్డి వెల్లడిరచారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఆర్దీవోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »