నిజామాబాద్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఏ చిన్న ప్రమాద సంఘటన చోరుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
పురాతన కాలంనాటి, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని గుర్తిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలను పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏకబిగిన కురుస్తున్న వానలకు పాత ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. గుంతలు తవ్విన ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నందున గండ్లు పడకుండా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యాలయాలకు పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినందున, అన్ని గ్రామపంచాయతీల పరిధిలోని నివాస ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరుగకుండా అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించాలని హితవు పలికారు. వరద నీరు పారుతున్న రోడ్ల మీదుగా, కల్వర్టులు బలహీనంగా ఉన్న రహదారులలో రాకపోకలను నిషేధిస్తూ, ఇతర ప్రాంతాల మీదుగా ట్రాఫిక్ మళ్లించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని హితవు పలికారు.
వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ సునీల్, డీఆర్‌డీఓ చందర్, డీపీవో జయసుధ, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.