నిజామాబాద్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమయింది. ఎడతెరిపి లేని ముసురువానకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు రోడ్లు తెగిపోవడం శిథిలావస్థలో ఇల్లు కూలిపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంటూ కలెక్టర్ కార్యాలయం, మునిసిపల్ కార్పొరేషన్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి పేద ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. కామరెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో కరెంటు షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిన్నారులు అద్నాన్ (4), మహిమ్ (6), హైమద్ (35), పర్వీన్ (30) మృత్యువాత పడ్డారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులన్నీ పూర్తిస్థాయిలో నీటి మట్టానికి చేరుకొని నిండుకుండల్లా మారాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. 90.3 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 74.186 టిఎంసిలకు చేరుకుంది. గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఐబిపి కమలహాసన్ రెడ్డి, సిపి నాగరాజు సందర్శించారు.
నిజాంసాగర్‌కు సైతం భారీ స్థాయిలో వరద పోటెత్తింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో రామడుగు, కౌలాస్‌నాలా, పోచారం, సింగీతం ప్రాజెక్టులు పూర్తిస్థాయి సీటిమట్టంకు చేరుకున్నాయి. కురుస్తున్న వర్షాలకు పంట నష్టం అంచనా వేయడం దానికి సంబంధిత అధికారులు నిమగ్నమై ఉన్నారు. గ్రామస్థాయి సిబ్బంది నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అలర్టుగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. మండల స్థాయిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.