నిజామాబాద్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపునకు గురైన నిజామాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సందర్శించారు. స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని వినాయకనగర్, బైపాస్ రోడ్, న్యూ కలెక్టరేట్, కంటేశ్వర్, మాణిక్ బండార్ ఎక్స్ రోడ్డు, అర్సపల్లి, బోధన్ రోడ్ తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు.
ప్రధాన రహదారుల పై నుండి ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతిని గమనించిన కలెక్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్గాల మీదుగా రాకపోకలను అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులు స్థానికంగానే ఉంటూ ట్రాఫిక్ ను సురక్షిత ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలని హితవు పలికారు. ప్రమాదాలు జరిగిన తరువాత సహాయక చర్యలు చేపట్టడానికి బదులు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఎంతో ఉత్తమమని సూచించారు.
వర్షం నిలిచిన వెంటనే రోడ్లపై ఆగి ఉన్న వరద నీటిని తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థతో పాటు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకుని అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినందున, అత్యవసరం ఉంటే తప్ప ఎవరు కూడా ఇళ్ల బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
అయితే జిల్లాలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ, పశు సంవర్ధక తదితర శాఖల అధికారులందరిని అప్రమత్తం చేశామని, పరస్పరం సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. డివిజన్ స్థాయిలో ఆర్దీవోలు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కాగా, పురాతన కాలం నాటి పాత ఇండ్లు, శిథిలావస్థకు చేరిన నివాస గృహాల్లో ఉంటున్న వారు తక్షణమే సమీప పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో పునరావాసం పొందాలని సూచించారు. గడిచిన నాలుగైదు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున తక్షణమే ఖాళీ చేయాలని హితవు పలికారు.
పునరావాస కేంద్రాల్లో భోజన వసతితో పాటు తగిన సౌకర్యాలు కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఏకబిగిన వానలు కురుస్తున్నందున విద్యుత్ తీగలు, స్తంభాల వద్దకు వెళ్లకూడదని హితవు పలికారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా నివాస ప్రాంతాల్లో సమస్యలు తలెత్తితే కలెక్టరేట్, నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందించాలని సూచించారు.