కామారెడ్డి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ అధికారులు గ్రామాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ప్రమాదం అనుకున్న పురాతన ఇల్లు ఖాళీ చేయాలని సూచించారు. విద్యుత్ , వ్యవసాయ, రెవెన్యూ అధికారులు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామస్థాయిలో ఉంటూ పంట నష్టం పై జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఆరోగ్య ,ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.
డివిజన్ల వారీగా పంట నష్టం జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.