కామారెడ్డి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిలో నివసించే వ్యక్తులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు.
నీటిపారుదల, రెవిన్యూ, గ్రామపంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. విద్యుత్ సమస్యలు ఉంటే గ్రామాల్లో విద్యుత్ అధికారులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆరోగ్య కార్యకర్తలు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో గర్భిణీలు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం కోసం ముందస్తుగా తరలించే విధంగా వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.
వరద ముప్పు ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న నివాస గృహాలను ఖాళీ చేయించాలని కోరారు. వాగుల వద్దకు ప్రజలు వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08468-220069 కు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ అధికారులు పట్టణ ప్రగతి ,పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కారం చేశారని చెప్పారు.
ఎక్కడైనా సమస్యలు ఉంటే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లాలో 4000 ఎకరాలలో పంటలు నీట మునిగాయని పేర్కొన్నారు. జిల్లాలో 180 ఇల్లు పాక్షికంగా కూలిపోయినట్లు తెలిపారు. గృహాలు కూలిపోయిన వారి వివరాలు గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది సేకరిస్తున్నారని చెప్పారు. జిల్లాలో వరదలు రావడం వల్ల 9 రోడ్లను మూసివేసినట్లు పేర్కొన్నారు.