ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం సాయంత్రం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ డ్యామ్‌ పై నుండే రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావుకు ఫోన్‌ ద్వారా పరిస్థితిని వివరించారు.

ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 90.00 టీఎంసిలకు గాను, ప్రస్తుతం 75.00 టీఎంసిల వద్ద నీరు నిలువ ఉందని తెలిపారు. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుండి ప్రస్తుతం 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. దీంతో ఫ్లడ్‌ గేట్ల ద్వారా దిగువ గోదావరి లోకి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని తెలిపారు.

దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, 75 టీఎంసిల వద్ద నీటి లెవెల్‌ను మెయింటైన్‌ చేస్తూ, ఎగువ నుండి వస్తున్న ఇన్‌ ఫ్లో కు అనుగుణంగా కాస్తంత ఎక్కువ పరిమాణంలో వరద జలాలను దిగువకు విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఎస్సారెస్పీ దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆరా తీశారు. ఎగువన గల మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుండి పెద్ద ఎత్తున మిగులు జలాలు వదులుతున్నందున ఎస్సారెస్పీ లోకి సుమారు 6 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్ల్లో వచ్చి చేరే అవకాశం ఉందన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్సారెస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొడిచెర్ల, చాకిరియాల్‌, సావెల్‌, తడపాకల్‌, దొంచందా, గుమ్మిర్యాల్‌ గ్రామాల వద్ద పోలీస్‌, రెవెన్యూ సిబ్బందిని నియమించి ఏ ఒక్కరూ గోదావరి వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అధికారులకు బాధ్యతలు పురమాయించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖల అధికారులు మొదలుకొని సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ఏ ఒక్క ప్రాణ నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి హితవు పలికారు.

గోదావరిలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ పంపుసెట్లు, మోటార్ల కోసం రైతులు వెళ్లకూడదని మంత్రి సూచించారు. గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ టామ్‌ టామ్‌ వేయించాలని అధికారులకు ఆదేశించారు. దొంచందా, తడపాకల్‌, పోచంపాడ్‌ అంబేడ్కర్‌ కాలనీ ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి, భోజన, వసతి ఏర్పాట్లు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా, బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సుమారు 22 గ్రామాల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడం పట్ల మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ట్రాన్స్కో అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

క్లిష్ట పరిస్థితుల్లోనే ప్రజలకు అండగా నిలవాలని, క్షేత్రస్థాయిలో ట్రాన్స్కో సిబ్బంది పనితీరు అందుకు భిన్నంగా ఉందన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, అవసరమైన నిధులను తాము సమకూరుస్తామని, విద్యుత్‌ సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరిస్తూ కరెంట్‌ సరఫరాను వెంటనే పునరుద్ధరించేందుకు కృషి చేయాలని ట్రాన్స్కో అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ విషయమై ట్రాన్స్కో సి ఎం డి గోపాల్‌ రావుకు కూడా ఫోన్‌ ద్వారా పరిస్థితి తీవ్రతను వివరించారు. ఎస్సారెస్పీ రిజర్వాయర్‌ ప్రాంతమైన పోచంపాడు వద్ద కూడా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో వరద పరిస్థితిని సమీక్షించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. తక్షణమే పరిస్థితిని చక్కదిద్దేలా చూడాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో పరిస్థితి పూర్తి గా అదుపులోనే ఉందన్నారు. కలెక్టర్‌ సహా అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురియనున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

చెరువులు, వాగులు పూర్తిస్థాయిలో నీటిమట్టాన్ని సంతరించుకొని అలుగులు ప్రవహిస్తున్నందున, వాటి వద్దకు ఎవరు కూడా వెళ్ళవద్దని హితవు పలికారు. ఆహ్లాదం కోసం వెళితే వర్ష తీవ్రత వల్ల వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. అదే విధంగా విద్యుత్‌ ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాపాయం బారిన పడకుండా చూసుకోవాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రజలను కోరారు. కాగా, ఎగువ గోదావరి నుండి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నందున బోధన్‌ రెవెన్యూ డివిజన్‌ లోని హంగర్గ గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కి ఫోన్‌ ద్వారా సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »