కామారెడ్డి, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయిల్ ఫామ్ సాగుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బిందు, తుంపర్ల సేద్యం పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని రైతు వేదికలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ తో పాటు రైతులకు అదనపు ఆదాయం కోసం తేనెటీగలు, చేపలు, పశుగ్రాసం పెంపకంపై దృష్టి సారించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు.
ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాగు కోసం ఎకరం యూనిట్ ధర రూ. 65 వేలు ఉంటుందన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కల కోసం రూ.15000, బిందు సేద్యం పరికరాల కోసం రూ. 25000, ఎరువులు పురుగు మందుల కోసం రూ.15 వేలు , ఇతర పనుల కోసం రూ. పదివేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న బిందు పరికరాలను ఈనెల 31 లోగా రైతు పొలాల్లో అమర్చాలని అధికారులను ఆదేశించారు.
ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులను గ్రామాల వారీగా ఎంపిక చేయాలని సూచించారు. అంతర్ పంటల వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి డి. సంజీవరావు, అధికారులు లోకేష్, రామకృష్ణ, బాపురెడ్డి, కంపెనీల ప్రతినిధులు కమలాకర్ రెడ్డి, సాయిరెడ్డి, అంజలి రెడ్డి, రాజు పాల్గొన్నారు.