నిజామాబాద్, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్‌ను జిల్లా పాలనాధికారి సి. నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆలోచనలకు పదును పెట్టడమే కాకుండా సైన్స్‌పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ‘ఇంటింటా ఎన్నోవేటర్ ‘ కార్యక్రమం వేదికగా నిలుస్తోందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నదన్నారు.
ఇందులో ప్రధానంగా సాధారణ జీవన విధానంలో వృత్తి వ్యాపారంలో తలెత్తే సమస్యలు సవాళ్లను పరిష్కరించుకునేందుకు స్వీయ ఆలోచనలతో స్థానికంగా లభించే పరికరాలతో వస్తువులను రూపొందించడానికి ప్రయత్నించాల్సి ఉంటుందని, ముఖ్యంగా విద్యార్థుల నుంచి మొదలు రైతులు, గృహిణులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఆవిష్కర్తలు చేసిన పరికరాలకు వారే పేటెంట్ పొందే అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజా ప్రతినిధులు ఈ ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
వాట్సాప్ ద్వారా…
ఆవిష్కరణలు రూపొందించే ముందు ఇందుకు సంబంధించిన నాలుగు ఫోటోలు, ఆరు వాక్యాలు, రెండు నిమిషాలు నిడివి కలిగిన వీడియో ఆవిష్కర్త పేరు సెల్ ఫోన్ నంబరు ప్రస్తుత వృత్తి పూర్తి వివరాలు చిరునామాను 9100678543 నంబర్ వాట్సప్ ద్వారా పంపించాల్సి ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చిన ఆవిష్కరణల అంశాల నుంచి ఉత్తమమైనవి ఎంపిక చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శిస్తారని, ఇందులో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రం అందజేయనున్నామన్నారు.
గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్‌ను ప్రోత్సహించడం, అవకాశం కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా సైన్సు అధికారి గంగా కిషన్, ఎన్‌సిఎస్‌సి కోఆర్డినేటర్ అందె గోవర్ధన్ పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు గంగా కిషన్ జిల్లా సైన్స్ అధికారిని (9848219365) సంప్రదించాలన్నారు.