నిజామాబాద్, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుండి ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా ప్రజావసరాలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు కలెక్టర్ శుక్రవారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.
వర్షాలు నిలిచిపోయినందున సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. అధికారులు, సిబ్బంది అందరూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించాలన్నారు. నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, అవసరమైన చోట పునరుద్ధరణ పనులను తక్షణమే జరిపించాలన్నారు. ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా జరగాలని, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, నివాస ప్రాంతాల వారీగా నీటి నాణ్యత, క్లోరినేషన్ ను తనిఖీ చేయించాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు.
ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఏర్పడితే సత్వరమే మరమ్మతులు జరిపించాలన్నారు. మంచి నీటి ట్యాంక్‌లను శుభ్రం చేయిస్తూ, క్లోరినేషన్ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బయట వెళ్లేందుకు అనుమతించకూడదని సంక్షేమ అధికారులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసి చైర్మన్లు పాఠశాలలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని, ఆయా బడుల వారీగా నివేదిక అందించేలా చూడాలని, ఎక్కడైనా వర్షపు జలాలు నిలిచి ఉంటే తక్షణమే వరద నీటిని బయటకు పంపించేలా చర్యలు చేపట్టాలని డీఈఓ దుర్గాప్రసాద్ ను ఆదేశించారు.
ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థను నిశితంగా పరిశీలన జరపాలని, ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ హితవు పలికారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరింత నిశితంగా పరిశీలన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. వ్యాధులు ముప్పిరిగొనే అవకాశాలు ఉన్నందున ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ప్రతి నివాస ప్రాంతంలో శానిటేషన్ వ్యవస్థను చక్కదిద్దాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు హితవు పలికారు.
ఇంటింటికి దోమతెర తప్పనిసరిగా వాడేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ముంపు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను అవసరమైతే మరికొన్ని రోజుల పాటు యధాతధంగా కొనసాగించాలని సూచించారు. వర్షాల తాకిడితో పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న నివాస గృహాల వివరాలను పక్కాగా సేకరించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ప్రతి చిన్న ఫిర్యాదుపైనా స్పందించి తగు చర్యలు చేపట్టేలా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు సూచించారు.
వరద ఉధృతితో గండ్లు పడిన చెరువులు, కాల్వలకు మరమ్మతులు చేయించాలని, తెగిపోయిన రోడ్ల వద్ద వేగవంతంగా పనులు జరిపిస్తూ రాకపోకలు సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరింపబడేలా చొరవ చూపాలని ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఏకధాటి వర్షాలతో ఇబ్బందులకు గురైన రైతాంగానికి అధికారులు వెన్నుదన్నుగా నిలువాలని కలెక్టర్ హితవు పలికారు. పంట పొలాలను వర్షపు నీరు ముంచెత్తిన నేపథ్యంలో, పంట నష్టం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని రైతులు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
వర్షాలతో దెబ్బతిన్న పంటల స్థానంలో రైతులు మళ్ళీ పంటలు వేసుకునే అవకాశం ఉన్నందున విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఎరువులు, విత్తనాల డీలర్లు, విక్రయదారులతో సమావేశమై తగినంత నిల్వలు తెప్పించుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా భారీ వర్షాల వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలను పరిశీలిస్తూ, వాటి వివరాలను ఆయా క్షేత్రాల వారీగా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
తద్వారా ఈ వివరాలను ట్రాన్స్ కో అధికారులకు అందించి, సత్వరమే విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దే పనులను జరిపించేందుకు వీలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సెల్ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు అన్ని ముఖ్య శాఖలకు చెందిన అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు పాల్గొన్నారు.