కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, నేషనల్ హైవే రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. పరిమితికి మించి వాహనాలను వేగంగా నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్, పోలీస్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు.
రామారెడ్డి మండల కేంద్రం సమీపంలో ఉన్న గంగమ్మ వాగు వద్ద, గర్గుల్ సమీపంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సదాశివనగర్ దర్గా సమీపంలో రామారెడ్డి రోడ్డు వరకు ఉన్న సర్వీస్ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.
మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల పరిధిలోని అంతర్గత రోడ్లను బాగు చేయాలని పేర్కొన్నారు. 2020 నుంచి2022 జులై 15 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ హైవే పిడి శ్రీనివాసరావు, ఆర్టీవో వాణి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, డిపిఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.