నిజామాబాద్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ (పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎఫ్‌డిఎస్, పిఎస్‌యు, ఏఐఎస్‌బి, పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురి చేసిందన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కొరత, భవనాల కొరత, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కొరత తీవ్రంగా ఉందన్నారు. బాసర ఐఐఐటీలో అనేక రకాల సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాసర ఐఐఐటీ సమస్యలకు నిలయమైందన్నారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలకే దిక్కు లేదన్నారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు. కానీ ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేసి, వాటిని సంస్కరించడంలో కనీస శ్రద్ధ చూపెట్టట్లేదన్నారు.
కేజీబీవీలు, గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత ఉందన్నారు. మెజారిటీ వాటికి సొంతభవనాలు లేవన్నారు. యూనివర్సిటీలు నిధుల లేమి, ఖాళీ పోస్టులతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల డొల్లతనాన్ని ఇటీవల వచ్చిన వర్షాలు బయటపెట్టాయని ఎద్దేవా చేశారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాంలు అందకపోవడం దారుణ పరిస్థితిని తెలియజేస్తుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని సంస్కరించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు యూనిఫామ్‌లను అందివ్వాలని, కేజీబీవీలు, గురుకులాలు ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు సమకూర్చి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
పై డిమాండ్లలో భాగంగానే ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేయకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి లోకమే తగిన గుణపాఠం చెబుతుందన్నారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. నరేందర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు విగ్నేష్, ఏఐఎఫ్‌డిఎస్ జాతీయ నాయకులు రాజ శేఖర్, పిఎస్‌యు జిల్లా కార్యదర్శి జ్వాల, ఏఐఎస్‌బి జిల్లా కార్యదర్శి మహేష్, పిడిఎస్‌యు జిల్లా నాయకులు సాయికృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు సుబోధ్, సమీర్, పిడిఎస్‌యు జిల్లా నాయకులు నిఖిల్, మహిపాల్, చందు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మహేష్, మారుతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.