నిజామాబాద్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగుల జెఏసి జిల్లా చైర్మన్ అలుక కిషన్ నేతృత్వంలో నిర్వహించిన ఉత్సవాల్లో నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగులతో పాటు వారి కుటుంబీకులు బోనాలతో ప్రదర్శనగా కలెక్టరేట్లోని నవదుర్గామాత ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండేలా దీవించాలని, అన్ని వర్గాల వారికి మేలు చేకూరేలా చూడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలు అందరిని అలరించాయి. బోనాలు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.