సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. శుక్రవారం జెడ్పి చైర్మన్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరుగగా, ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ముప్పిరిగొనే అవకాశాలు ఉన్నాయని సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయమై జెడ్పి చైర్మన్‌ విఠల్రావు స్పందిస్తూ, రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో అనేక ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని అన్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించడం జరిగిందని, సదుపాయాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ముఖ్యంగా వర్షాకాలం కావడం, అందులోనూ భారీ వర్షాలు కురిసినందున సీజనల్‌ వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి నివాస ప్రాంతంలోనూ సీజనల్‌ వ్యాధుల నివారణకు అవకాశం ఉన్న మేరకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు సాధారణంతో పోలిస్తే 183 శాతం అధిక వర్షపాతం కురిసిందని వివరించారు. ఏకధాటిగా వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాల వల్ల పలుచోట్ల నష్టం వాటిల్లిందని, అయితే అధికారులు, ప్రజాప్రతినిధులందరి సహకారంతో ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టిన కారణంగా చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామని పేర్కొన్నారు.

ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, పురాతన గృహాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, విద్యుత్‌ సంబంధిత ప్రమాదాలపై ముందుగానే దృష్టిని కేంద్రీకరించడం వల్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. పడకల్‌ పెద్ద చెరువు మినహా మిగతా అన్ని చెరువులను గండ్లు పడకుండా కాపాడుకోగలిగామని అన్నారు. జిల్లాలో 68.63 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, పరిశీలన నిమిత్తం జిల్లాకు వచ్చిన కేంద్ర బృందానికి వరద నష్టం వివరాలు అందించామని కలెక్టర్‌ తెలిపారు.

అయితే దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ ఫార్మర్లు తదితర వాటిని తక్షణమే పునరుద్ధరించుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు సోకకుండా గ్రామ పంచాయతీల వారీగా ప్రతి నివాస ప్రాంతంలో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కోరారు. కాగా, భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి సంబంధిత శాఖల అధికారులు సభ్యులకు వివరించారు.

వైద్యారోగ్య శాఖ పై చర్చ సందర్భంగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాలని సభ్యులు కోరారు. ఈ దిశగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ శాయశక్తులా కృషి చేస్తున్నారని, ముఖ్యంగా సిజీరియన్‌ ఆపరేషన్లు తగ్గించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌, జెడ్పి చైర్మన్‌ విఠల్రావు ప్రశంసించారు.

కాగా, సీజనల్‌ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ప్రత్యేకంగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు స్పెషల్‌ ఓ.పీ ఏర్పాటు చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు. సమావేశంలో జెడ్పి సీఈఓ గోవింద్‌, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల జెడ్పిటిసిలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »