కామారెడ్డి, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీ వీల్ ట్రాక్టర్లు రోడ్లపై నడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు మాట్లాడారు.
గ్రామీణ రోడ్లపై కేజీవీల్ ట్రాక్టర్ నడవడం వల్ల రోడ్లు అద్వానంగా తయారవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కేజీవీల్ ట్రాక్టర్లు నడపకుండా గ్రామస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. రోడ్లపై కేజీవీల్ ట్రాక్టర్ నడిపిన డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి రోడ్లకు తక్షణమే అధికారులు మరమ్మత్తులు చేయించాలని సూచించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. మండల సమావేశాలకు డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
డివిజన్ స్థాయి అధికారులు మండల సభలకు రాకపోవడం వల్ల మొక్కుబడిగా మండల సభలు ముగుస్తున్నాయని చెప్పారు. మండల సభలకు హాజరు కాని డివిజన్ స్థాయి అధికారులపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడారు. అటవీ శాఖ, ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. 24 కిలోమీటర్లు బీటీ రోడ్డు కు ఇంతవరకు 20.5 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 3.5 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేయవలసిందని పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయం, నీటిపారుదల, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, గ్రామపంచాయతీ, విద్యుత్ శాఖలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీలు, జెడ్పిటిసి సభ్యులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.