బాధితులకు సత్వరమే పరిహారం అందేలా చొరవ చూపాలి

నిజామాబాద్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పలు నివాస గృహాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వపరంగా సత్వరమే నష్టపరిహారం అందేవిధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు.

నిర్విరామంగా వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు నివాస గృహాలు కోల్పోయిన, పాక్షికంగా దెబ్బతిన్న నివాసాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం అందేలా చూడాలన్నారు. అప్పుడే వారికి ఊరట లభించినట్లవుతుందని, ప్రభుత్వ తోడ్పాటు పట్ల నమ్మకం పెంపొందుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. వరద జలాలతో దెబ్బతిన్న రోడ్లు, ఇతర సౌకర్యాల పునరుద్ధరణకు తాత్కాలిక మరమ్మతు పనులు తక్షణమే పూర్తి చేయించాలని, అన్ని ప్రాంతాలకు రాకపోకలు యధాస్థితిలో జరగాలన్నారు.

విద్యుత్‌ సరఫరాకు ఎక్కడ కూడా అంతరాయం ఏర్పడకుండా అన్ని లైన్లను, ట్రాన్స్‌ ఫార్మర్లను సరిచేసుకోవాలని ట్రాన్స్‌ కో అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు సోకకుండా ప్రతి నివాస ప్రాంతంలో పారిశుధ్య పనులను రోజువారీగా పర్యవేక్షించాలని, వర్షపు జలాలు, మురుగునీరు నిలువ ఉండకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి పైప్‌ లైన్‌ లీకేజీలు ఏర్పడిన వెంటనే మరమ్మతులు చేయించాలని, తాగునీటి నాణ్యతను పరిశీలించాలని, తప్పనిసరిగా క్లోరినేషన్‌ జరిపించాలని ఆదేశించారు.

ప్రజలు దోమకాటు బారిన పడకుండా ప్రతి ఒక్కరు దోమతెర వాడేలా చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్తూ ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా, కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరిగిన కాన్పుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి పక్కాగా సేకరించాలని సూచించారు. ఏ ఒక్క కాన్పునకు సంబంధించి కూడా వివరాల్లో తేడా ఉండకూడదని అన్నారు.

హరితహారం ప్రగతిని సమీక్షిస్తూ, మొక్కలు నాటే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. మరో రెండు వారాల్లోపు హరితహారం కార్యక్రమాన్ని ముగించనున్న దృష్ట్యా సాధ్యమైనంత వరకు వారం రోజుల్లోపే కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేలా కృషి చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఒక్క మొక్క కూడా వృధా కాకుండా, నిర్దేశిత ప్రదేశాల్లో ప్రాధాన్యత క్రమంలో మొక్కలు నాటేలా పర్యవేక్షణ చేయాలన్నారు.

నాటిన మొక్కల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ఆయా ప్రాంతాలకు కేటాయించిన మొక్కలను దారి మళ్ళించకూడదని అన్నారు. బృహత్‌ పల్లె ప్రక్రుతి వనాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు అవసరమైన స్థలాన్ని సత్వరమే గుర్తించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ చందర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శన్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ నారాయణ, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »