పరస్పర ఆలోచనలతోనే సమర్థవంతమైన పరిశోధనలు

హైదరాబాద్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దిష్ట శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించడానికి జన్యుశాస్త్రంలోని వివిధ విభాగాలతో వినూత్న రీతిలో సమీకృత పరిశోధనలు జరపాలని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్‌ డాక్టర్‌ డి. శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘సమీకృత జీవశాస్త్రం అనువర్తిత జన్యుశాస్త్రం’’ పై ఓయూ ఠాగూర్‌ ఆడిటోరియంలో మూడు రోజులుగా జరుగుతున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

జీవశాస్త్ర అనుబంధ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అకడమిక్‌ వరకే కాకుండా పరిశోధనల పరంగాను సంస్థను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పరస్పరం ఆలోచనలను పంచుకున్నప్పుడే సమర్ధవంతమైన పరిశోధనలకు ఆస్కారం ఉంటుందని ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి. లక్ష్మీనారాయణ అన్నారు. ఉస్మానియా బయోటెక్నాలజీ, జన్యుశాస్త్రం సహా ఇతర జీవశాస్త్ర అనుబంధ విభాగాల్లోని విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధనలపై మరింత దృష్టి సారించాలని హితవు పలికారు.

అంతకు ముందు జరిగిన మరో సమావేశంలో పాల్గొన్న ఓయూ వీసీ ప్రొఫెసర్‌ డి. రవిందర్‌ సమకాలీన సమాజంలో మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య రుగ్మతలను పరిష్కరించటమే లక్ష్యంగా జీవశాస్త్ర అనుబంధ రంగాల్లో పరిశోధనలు మరింత వేగంగా జరగాలని పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన సహకారం కోసం పూర్వ విద్యార్థుల ప్రపంచ వ్యాప్త నెట్‌ వర్క్‌ను ఏర్పాటు చేయాలని నొక్కి చెప్పారు.

మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించిన సీఎఫ్‌ఆర్డీ డైరెక్టర్‌, ఓయూ జెనెటిక్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ స్మితా సి. పవార్‌ ను వీసీ, రిజిస్ట్రార్‌ లు అభినందించారు. అల్యూమినీ అసోసియేషన్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ యూఎస్‌ఏ చాఫ్టర్‌ను ఈ సందర్భంగా మిస్సిస్సిప్పి నుంచి ప్రొఫెసర్‌ జీకే హెడా ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థల నుండి 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

జపాన్‌, యుకె, యుఎస్‌ఎ, ఇటలీ సహా మనదేశంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వక్తలుగా పాల్గొన్నారు. సదస్సులో వివిధ విభాగాలపై సాంకేతిక సెషన్లు నిర్వహించారు. 42 మౌఖిక ప్రదర్శనలు, 94 పోస్టర్‌ ప్రదర్శనలు ఇందులో ఉన్నాయి. ప్రతినిధులు తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్లాంట్‌ జెనెటిక్స్‌ మరియు హ్యూమన్‌ జెనెటిక్స్‌ రంగాలలో బెస్ట్‌ పోస్టర్‌ మరియు ఓరల్‌ ప్రెజెంటేషన్‌ అవార్డులను నిర్వాహకులు అందించారు.

యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డును వెల్లూరు ఇన్స్ట్రిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) కి చెందిన ప్రీతి దక్కించుకుంది. సదస్సులో భాగంగా జరిగిన వివిధ కార్యక్రమాల్లో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ బి.వీరయ్య, యూజీసీ వ్యవహారాల డీన్‌ ప్రొఫెసర్‌ మల్లేశం, పూర్వ విద్యార్థుల వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మనోహర్‌ రావు, డాక్టర్‌ రాజేందర్‌ రావు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »