బోధన్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులను దేశం అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్న సమయంలో ప్రజా ఉద్యమమే ఏకైక మార్గమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. సుధాకర్ పిలుపునిచ్చారు. అదే స్థాయిలో సిపిఐ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. శనివారం కోటగిరి మండల సిపిఐ మహాసభ కోటగిరిలోని గీతా పారిశ్రామిక సహకార సంఘ భవన్‌లో జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ జెండాను సిపిఐ జిల్లా నాయకులు వై. ఓమయ్య ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభకు ఏ.విటల్ గౌడ్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సిపిఐ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం నిర్వహించిందని, ప్రస్తుతం ప్రజా కార్మిక సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.
పార్టీ ప్రజాసంఘాల బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. సిపిఐ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ రాములు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికే జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, ఇతర కాంట్రాక్ట్‌ల పేరుతో ప్రజల సంక్షేమం కొరకు అమలు చేయాల్సిన నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా టిఆర్‌ఎస్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 55 సంవత్సరాలు ఉన్నటువంటి వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని, రైతాంగానికి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్, నీలి దత్తు, సోమ రాములు, బర్ల సునీల్ కుమార్, మల్లేష్, నీలి శంకర్, గోపాల్, ఎస్.కె యాసిన్, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.