నిజామాబాద్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలనిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ శనివారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 1 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 15 వేల 310 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు కొనసాగుతాయని సూచించారు.
అదేవిధంగా ఎస్సెస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 వ తేదీ నుండి 6 వ తేదీ వరకు జరగనుండగా, 1778 మంది హాజరుకానున్నారని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వివరించారు. వీరి కోసం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని తెలిపారు. పరీక్షలు ప్రారంభం అయ్యే నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హితవు పలికారు.
విద్యార్థులు తమ తమ కళాశాలలు, పాఠశాలల నుండి హాల్ టిక్కెట్లు పొందవచ్చని, నేరుగా వెబ్ సైట్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కాగా, ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్‌ల వారీగా పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలన్నారు.
పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసిఉంచాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా రక్షిత మంచినీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని, తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎం లను ఎగ్జామ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని, పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ముఖ్యంగా వర్షాకాలం సీజన్ అయినందున ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్.ఎం ఉషాదేవిని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోనళకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ లను నియమించాలని అన్నారు. కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు, డిఐఈఓ రఘురాజ్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.