కామారెడ్డి, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు రెండు వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలపై జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురుగు కాలువలు పూడిక మట్టి నిండితే తక్షణమే తీయించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామస్థాయిలో ఆరోగ్య ,ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలని కోరారు.
రోడ్ల పక్కన గుంతల్లో నీరు నిల్వ ఉంటే ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు.కాచి చల్లార్చిన నీటిని తాగాలని పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారాన్ని రోడ్లపై వేయవద్దని, చెత్త సేకరణ వాహనాల్లోని వేయాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రైడేను నిర్వహించాలని పేర్కొన్నారు. ఇండ్లలోని నీటి ట్యాంకులు, చెత్తకుండీలు, పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు.