సీజనల్‌ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు

నిజామాబాద్‌, జూలై 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వసతి గృహాల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా, నాణ్యమైన భోజనం అందేలా ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు.

వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ఈగలు, దోమలు, బొద్దింకలు, పురుగుల నివారణ కోసం అందుబాటులో ఉన్న అన్ని ఆధునిక పద్దతులను అవలంభించాలని అన్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వసతి గృహాల్లో ముందస్తు చర్యలు చేపట్టడం, బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్య సాధన తదితర అంశాల పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు సంబంధిత శాఖల మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మంత్రుల దృష్టికి తెచ్చారు. గ్రామ పంచాయతీల వారీగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ఏ ఎన్‌ ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులతో కూడిన బృందాలతో ప్రత్యేకంగా శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, విద్యాసంస్థల్లో వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం లేకుండా సాధారణ పరిస్థితి కొనసాగేలా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఒక్కో పాఠశాల వారీగా, నివాస ప్రాంతం వారీగా శానిటేషన్‌ పనులను అనునిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మంచినీటి పైప్‌ లైన్‌లకు ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని, ప్రతి ట్యాంకును శుభ్రం చేయిస్తూ క్లోరినేషన్‌ జరిగేలా చూడాలన్నారు. ఎక్కడ కూడా మురుగు నీరు, వర్షపు జలాలు నిలువ ఉండకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్‌, ఆయిల్‌ బాల్స్‌ తదితర చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. తలుపులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, కిటికీలకు దోమలు లోనికి ప్రవేశించకుండా జాలీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

పాడైపోయిన బియ్యం, ఇతర వస్తువులను వినియోగించకూడదని, పాడైన బియ్యం స్థానంలో నాణ్యమైన బియ్యం అందించాల్సిందిగా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఎవరికైనా నిధుల సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో ఏ ఒక్క చోట కూడా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏ.ఎన్‌.ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దోమతెర వినియోగించేలా చూడాలన్నారు. రేపటి నుండే ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని, ఆదేశించారు.

ప్రతి నివాస ప్రాంతంలో పరిసరాలను పరిశీలిస్తూ, ఎక్కడైనా సమస్య ఉంటే తక్షణమే పరిష్కరించాలని అన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ఇంటింటికి స్టిక్కర్లు అతికించాలని సూచించారు. హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంటే ముందుగా నోటీసులు జారీ చేయాలనీ, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని అన్నారు. గ్రామాల్లో నివాస ప్రాంతాల సమీపంలో పెంటకుప్పలు తొలగించేందుకు చొరవ చూపాలని, అవసరమైతే కఠిన నిర్ణయాలతో ముందుకెళ్లాలని అన్నారు.

కాగా, పన్నెండు సంవత్సరాలు, అంతకు పైబడిన వయస్సు కలిగిన వారందరు తప్పనిసరిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు, అన్ని కళాశాలల్లో రేపటి నుండే ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని, ప్రతి రోజు కనీసం 30 వేల మందికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. వారం రోజుల్లోపు విద్య సంస్థల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన మీదట, అర్హులైన మిగతా వారందరికీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్‌, డీపీవో జయసుధ, డీ ఎం హెచ్‌ ఓ డాక్టర్‌ సుదర్శన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : వీడియో కాన్ఫరెన్సులో మంత్రులు

భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగ్యూ,మలేరియా, అతిసారం వంటి వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ బిఆర్‌కే భవన్‌ నుండి సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ అంశాల పై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఇప్పటి వరకు 1610 డెంగ్యూ కేసులు వచ్చాయని మంత్రి తెలిపారు. పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి డెంగ్యూ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరం ఇప్పటివరకు 260 మలేరియా కేసులు, 1610 డెంగ్యూ కేసులు, 42 చికెన్‌ గునియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి శుక్రవారం గ్రామా స్థాయిలో, ఆదివారం రోజున పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ నిర్వహించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని మంత్రి హరీష్‌ రావు కలెక్టర్లకు సూచించారు.

డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు, బ్లడ్‌ ప్లేట్‌ లెట్స్‌ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రచారం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్‌ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్‌ స్కూల్స్‌ లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వినియోగించాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ప్రతివారం రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఫాగింగ్‌ చేపట్టాలని, కిచెన్‌ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.77 కోట్ల మంది ప్రజలకు బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ అందించాలని, ఇప్పటి వరకు 20 లక్షల మంది ప్రజలకు బూస్టర్‌ డోస్‌ వేసామని మంత్రి తెలిపారు.

26 ఆగస్టు,2022 నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ క్యాంపులు నిర్వహించి 12 నుంచి 17 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కోసం ప్రజాసంచారం అధికంగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌ మార్కెట్లలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, గ్రామాలు మున్సిపాలిటీలో ఇంటింటా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ వేయాలని మంత్రి ఆదేశించారు.

జిల్లాలో ప్రైవేట్‌ సంస్థల యాజమాన్యాలతో విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుని విద్యార్థులకు వ్యాక్సిన్‌ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ, గ్రామాలలో మురికి కాలువలనుశుభ్రం చేయించాలని, మిషన్‌ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయాలని, పైప్‌ లైన్‌ లీకేజీలను అరికట్టాలని సూచించారు. గ్రామాలలో ప్రజలు కాచిన నీళ్లు తాగేవిధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.

పంచాయత్‌ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో చేయాలన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్‌ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేయాలని, వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని అన్నారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని,తరచూ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, వసతి గృహాలు, పరిసరాలలో పరిశుభ్రత పాటించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న పాత బియ్యం స్టాక్‌ స్థానంలో నూతనంగా బియ్యం సరఫరా చేస్తున్నామని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలుకు అంగీకరించినందున రైస్‌ మిల్లులు త్వరితగతిన ప్రారంభించి సకాలంలో బియ్యం సరఫరా జరిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ, ప్రతి గిరిజన పాఠశాలకు ఒక అధికారికి బాధ్యత అప్పగించి ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.

రెసిడెన్షియల్‌ పాఠశాల పరిసరాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రతి మాసం వైద్యులు వచ్చి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైస్‌ మిల్లుల త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు 2 షిఫ్టులలో కస్టం మిల్లింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని సిఎస్‌ సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »