నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా జిల్లాలో నేటి (బుధవారం) నుండి ఇంటింటి సర్వే చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దాదాపు గడిచిన మూడు వారాల నుండి నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నందున అతిసారం, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ దిశగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో ఈ నెల 27 వ తేదీ నుండి ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులతో కూడిన బృందాలతో ఇంటింటి సర్వేను పకడ్బందీగా జరిపించాలని, ఎంపీడీఓలు, ఎంపీఓలు కూడా క్షేత్రస్థాయిలో పాల్గొంటూ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు.
ఫ్రైడే – డ్రై డే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తూ, ప్రతి రోజు కనీసం 50 ఇళ్లను సర్వే చేయాలని లక్ష్యం విధించారు. సర్వే సందర్భంగా ప్రతి నివాస గృహం పరిసరాలను పరిశీలిస్తూ, ఎక్కడైనా చెత్తా చెదారం ఉన్నట్లయితే దానిని అప్పటికప్పుడే తొలగించేలా చూడాలని, ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. వర్షపు జలాలు, మురుగు జలాలు నిలువ ఉండకుండా చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబం దోమతెరలు వాడేలా ప్రోత్సహించాలని సూచించారు. మహిళా సంఘాలలో సభ్యులుగా కొనసాగుతున్న వారు దోమతెరలు వినియోగించేలా డీఆర్డీఓ, మెప్మా అధికారులు కృషి చేయాలన్నారు.
అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ నివారణ కోసం వాక్సిన్ తీసుకునేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఎవరైనా జ్వరాలతో బాధపడుతుంటే అలాంటివారి వివరాలను సేకరించాలని, ప్రతి రోజు సర్వే వివరాలతో కూడిన నివేదికను అందించాలని సూచించారు. ప్రస్తుతం ముందస్తుగానే చేపడుతున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించగలితే, రానున్న మరో రెండుమూడు నెలల పాటు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడుకోగల్గుతామని, సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటాయని కలెక్టర్ హితవు పలికారు. సర్వే ప్రాధాన్యతను గుర్తెరిగి అంకితభావంతో పని చేయాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ గత సంవత్సరం తరహా పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉన్నందున, మొదటి, రెండవ డోసులు తీసుకోని వారికి సత్వరమే వాక్సిన్ ఇవ్వాలని, వీటిని ఇప్పటికే తీసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని సూచించారు. వచ్చే శనివారం నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పన్నెండు సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగిన విద్యార్థిని, విద్యార్థులందరికీ కోవిడ్ వాక్సిన్ లు వేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఆదేశించారు.
ఒక్కో వ్యాక్సీనేటర్ కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతిరోజు జిల్లాలో కనీసం 35 వేల మందికి కోవిడ్ వాక్సిన్ లు వేయాలని సూచించారు. విద్యా సంస్థల్లో ఈ ప్రక్రియ శనివారం నాటికి పూర్తి చేసి, వచ్చే సోమవారం నుండి అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన వారందరికీ వాక్సిన్ లు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని, గర్భిణీల నమోదు తప్పనిసరిగా జరగాలని, రక్తహీనత బారిన పడకుండా ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలలో ఓ.పీ పెరగాలని కలెక్టర్ సూచించారు.
వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారి అశోక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అంజన, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రaాన్సీ తదితరులు పాల్గొన్నారు.