నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణ తరగతుల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్ కలెక్టర్‌లను ఆదేశించారు. మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో స్వచ్చందంగా అనుసంధానం చేసుకునేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఆయా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ దిశగా ప్రజలను చైతన్యపర్చేలా చూడాలన్నారు. ఓటర్లు స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఆధార్ ను అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
అదేవిధంగా ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదుకు సంబంధించిన నిర్ణీత ఫారంలో, అలాగే ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫారంలో ఎన్నికల సంఘం పలు మార్పులు చేసినందున వీటి విషయమై ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సహాయ అధికారులు, సాంకేతిక సిబ్బంది అందరికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఈ దిశగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 27 న నిర్వహించనున్న శిక్షణ తరగతులకు ప్రతి జిల్లా నుండి మాస్టర్ ట్రైనీలను పంపించాలని సూచించారు.
వీరు తమతమ జిల్లాలలో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తారని అన్నారు. ఈ నెల 30 వ తేదీ లోపు అన్ని స్థాయిలలో శిక్షణ తరగతులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పందిస్తూ, ఈ నెల 28 న జిల్లా స్థాయిలో స్థానిక కలెక్టరేటులోని ప్రగతి భవన్లో ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు.
ఈ నెల 29 న మండల స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పవన్ కుమార్, ఆర్దీవోలు రవి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.