నిజామాబాద్, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25 న నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళ తన కుమారునితో జానకంపెట్ గ్రామ శివారులోని అశోక్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూ క్లోట్ సిబ్బంది వారిని కాపాడారు. ఈ మేరకు సీపీ నాగరాజు ఎడపల్లి పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ళు భాస్కర్, వెంకటేష్ రెడ్డిలను అభినందించారు.
ఈ నెల 25న నిజామాబాద్ పట్టణానికి చెందిన లావణ్య భర్త వేధింపులతో తన 3 సంవత్సరాల కుమారునితో అశోక్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తక్షణమే స్పందించిన ఎస్సై పాండేరావు హుటాహుటిన బ్లూ క్లోట్ సిబ్బంది భాస్కర్, వెంకటేష్ రెడ్డిలని అప్రమత్తం చేశారు.
దీంతో వెనటనే అక్కడికి చేరుకున్న బ్లూ క్లోట్ సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడుతున్న తల్లీ కొడుకులను రక్షించి వారిని పీఎస్‌కు తరలించారు, లావణ్య భర్తను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి వారిని ఇంటికి పంపించేశారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో సీపీ నాగరాజు ఇద్దరి ప్రాణాలు రక్షించిన కానిస్టేబుళ్ళను గురువారం అభినందించారు, శాలువలతో సత్కరించి రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ రామారావు, రూరల్ సిఐ శ్రీనివాస్ రాజు, ఎడపల్లి ఎస్సై పాండేరావు ఉన్నారు.